హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై ఎంఐఎం నేతను నరికి చంపిన స్నేహితుడి కుమారులు

  • తండ్రిని చంపిన అసద్‌పై పగతో రగిలిపోయిన కుమారులు
  • బైక్‌పై వెళ్తున్న అసద్‌ను ఆటోతో ఢీకొట్టిన నిందితులు
  • కిందపడగానే వేటకొడవళ్లతో అందరూ చూస్తుండగానే దాడి
  • అసద్ మృతదేహంపై 50కిపైగా కత్తిపోట్లు
హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. ఎంఐఎం నేత అసద్‌ఖాన్ (45)ను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజేంద్రనగర్ సమీపంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ప్రతీకారంతోనే ఈ హత్య  జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.

వారి కథనం ప్రకారం.. అసద్‌ఖాన్, అంజాద్ ఖాన్ మంచి స్నేహితులు. నాలుగేళ్ల క్రితం అసద్ తన కుమార్తెను అంజాద్ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసి బంధువులుగా మారారు. అయితే, ఆ తర్వాత కొంతకాలానికి భర్తతో మనస్పర్థల కారణంగా అసద్ కుమార్తె పుట్టింటికి వచ్చేసింది. ఈ గొడవలన్నింటికీ తన మిత్రుడు అంజాదే కారణమని భావించిన అసద్ అతడిపై పగపెంచుకున్నాడు. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో 2018లో శాస్త్రిపురంలో ఒంటరిగా ఉన్న అంజాద్‌ను మరో ఐదుగురితో కలిసి హతమార్చాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన అసద్ ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు.

మరోవైపు తమ తండ్రిని చంపిన అసద్‌పై పగతో రగిలిపోతున్న అతడి కుమారులు సమయం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న వారికి సమయం కలిసి వచ్చింది. మిత్రుడు బాబాతో కలిసి మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో అసద్‌ఖాన్ వల్లెపల్లి వైపు వెళ్తున్నాడు. ఇదే మంచి సమయమని భావించిన నిందితులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నైస్ హోటల్ సమీపంలో ఆటోలో రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి అసద్ బైక్‌ను ఢీకొట్టారు.

అందరూ చూస్తుండగానే కిందపడిన అసద్‌పై వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా దాడిచేశారు. అసద్ శరీరంపై 50కిపైగా కత్తిపోట్లు ఉన్నాయంటే వారు ఎంత ప్రతీకారంతో రగిలిపోయిందీ అర్థం చేసుకోవచ్చు. అసద్ చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత మారణాయుధాలను అక్కడే పడేసి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అసద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంజాద్ ఖాన్ కుమారులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.


More Telugu News