బెంగాల్‌లో ఉద్రిక్తంగా రెండో దశ పోలింగ్.. యుద్ధభూమిని తలపించిన నందిగ్రామ్!

  • ఉద్రిక్తత మధ్యే నందిగ్రామ్‌లో 80.53 శాతం పోలింగ్
  • సువేందు అధికారి కారుపై దాడి
  • కేశ్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్త హత్య
  • నందిగ్రామ్‌లో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి
  • గవర్నర్‌కు మమత ఫిర్యాదు
  • బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలపైనా ఆరోపణ
రెండో విడత ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపించింది. నిన్న మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి ముఖాముఖి తలపడుతున్న నందిగ్రామ్‌లోనూ నిన్ననే పోలింగ్ జరిగింది. హింసాత్మక ఘటనల మధ్యే ఇక్కడ 80.53 శాతం పోలింగ్ నమోదైంది. నందిగ్రామ్‌లో మమత, సువేందు అధికారి పోటాపోటీగా పర్యటించారు. ఎన్నికల్లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మమతా బెనర్జీ నేరుగా గవర్నర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుంటున్నారని, టీఎంసీ మద్దతుదారులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల సంఘంపైనా పలు  ఆరోపణలు చేశారు. తాము 63 ఫిర్యాదులు చేస్తే ఒక్క దానిపైనా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు కూడా కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేశాయని మమత ఆరోపించారు.

మరోవైపు, నందిగ్రామ్‌లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి వస్తున్న సువేందు అధికారి  కారుపై దాడి జరిగింది. ఇది టీఎంసీ గూండాల పనేనని ఆయన ఆరోపించారు. అలాగే, కేశ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తన్మయ్ ఘోష్ వాహనంపైనా దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలే ఈ దాడికి దిగినట్టు పోలీసులు తెలిపారు.

పశ్చిమ మేదినీపూర్‌ జిల్లా కేశ్‌పూర్‌లో తృణమూల్ కార్యకర్త ఉత్తమ్ దోలుయ్ (48) హత్యకు గురికావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు ఈ హత్య జరగ్గా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని టీఎంసీ ఆరోపించింది.

ఇంకోవైపు, నందిగ్రామ్‌లోని బెకుటియా ప్రాంతంలో బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని బీజేపీ ఆరోపించింది.


More Telugu News