ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్న నీలం సాహ్ని

  • గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించిన త‌ర్వాత సీఎస్‌తో భేటీ
  • కాసేప‌ట్లో డీజీపీ, క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశం
  • సాయంత్రం ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా ఈ రోజే బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ నీలం సాహ్ని ‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విష‌యంపై ఆమె ఈ రోజు  రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో చ‌ర్చించిన విష‌యం తెలిసిందే.

ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో ‌ ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పిన ఆమె అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో ఎస్‌ఈసీ కార్యాలయంలో నీలం సాహ్ని  స‌మావేశ‌మై ఎన్నిక‌లపై చ‌ర్చ‌లు జ‌రిపారు. కాసేప‌ట్లో డీజీపీతో పాటు క‌లెక్ట‌ర్ల‌తో ఆమె చ‌ర్చించ‌నున్నారు.

ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆమె చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అంతేకాదు, ఈ రోజు సాయంత్రం ఆమె ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నిక‌ల‌కు గ‌త ఏడాది మార్చి 7నే నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన విష‌యం తెలిసిందే. అయితే, అనంత‌రం క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి.


More Telugu News