'కొవాగ్జిన్' తమకు వద్దన్న బ్రెజిల్... అనుమతి నిరాకరణ!

  • ఐసీఎంఆర్ తో కలిసి సంయుక్తంగా తయారీ
  • అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో బ్రెజిల్
  • ఉత్పత్తి విధానాలు సంతృప్తి కాదన్న బ్రెజిల్
  • సమస్యను పరిష్కరిస్తామన్న భారత్ బయోటెక్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేసిన కొవాగ్జిన్ టీకాను తమ దేశంలో వాడేందుకు బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణా సంస్థ అనుమతిని నిరాకరించింది. ఇప్పటికే రెండు కోట్ల కొవాగ్జిన్ డోస్ లకు బ్రెజిల్ నుంచి ఆర్డర్ వచ్చిన సంగతి తెలిసిందే. యూఎస్ తరువాత అత్యధిక కొవిడ్ బాధిత దేశంగా బ్రెజిల్ రెండో స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే.

ఇక బ్రెజిల్ ప్రభుత్వ గెజిట్ లో ప్రకటించిన వివరాల ప్రకారం, మంచి ఉత్పత్తి విధానాలను భారత్ బయోటెక్ పాటించని కారణంగానే, వాడకం అనుమతిని నిరాకరిస్తున్నామని పేర్కొనడం కలకలం రేపింది. ఈ వార్తలపై స్పందించిన భారత్ బయోటెక్, బ్రెజిల్ వెల్లడించిన సమస్య ఆ దేశ అధికారులు తమ ప్లాంటును సందర్శించిన సమయంలోనే వచ్చిందని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని పేర్కొంది.

కాగా, ప్రస్తుతం కొవాగ్జిన్ ను ఇండియాలో అత్యవసర వినియోగం నిమిత్తం వాడుతున్న  సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ వ్యాక్సిన్ కు అనుమతులు లభించాయి. మార్చి ప్రారంభంలో కొవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ కు సంబంధించిన మధ్యంతర నివేదిక వెలువడగా, 81 శాతం ప్రభావవంతమైనదని తేలింది. తమ వ్యాక్సిన్ యూకే వేరియంట్ పైనా సమర్థవంతంగా పనిచేస్తోందని కూడా భారత్ బయోటెక్ పేర్కొంది.

ఇదిలావుండగా, కొవాగ్జిన్ ను ఇప్పటికే ఇరాన్, నేపాల్, మారిషస్, పరాగ్వే, జింబాబ్వే తదితర దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ తో పాటు థాయ్ ల్యాండ్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు ఇంకా అనుమతి ఇవ్వలేదు. మొత్తం 40 దేశాలు తమ వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపాయని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది.


More Telugu News