నా శాఖతో ఆయనకేం పని?... సీఎం యడియూరప్పపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి

  • కర్ణాటక ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామం
  • సీఎంపై మంత్రి ఈశ్వరప్ప సంచలన ఆరోపణలు
  • తన శాఖకు సంబంధించి సీఎం ఆదేశాలిస్తున్నారని ఆగ్రహం
  • గవర్నర్ తో పాటు బీజేపీ అధిష్ఠానానికి లేఖ
కర్ణాటక ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం యడియూరప్పపై సొంత క్యాబినెట్ లోని మంత్రే గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. సీఎంగా యడియూరప్ప తన పరిధిని మీరుతున్నారని, తాను నిర్వహిస్తున్న శాఖలో ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఈశ్వరప్ప సీఎంపై గవర్నర్ కు, బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. 1977 క్యాబినెట్ అధికారాల విభజన నిబంధనలను సీఎం యడియూరప్ప అతిక్రమించారని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ కు రాసిన లేఖను ఈశ్వరప్ప ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు కూడా పంపించారు.

ఓ జిల్లాకు చెందిన వ్యవహారాల్లో తన శాఖకు సంబంధించిన రూ.65 కోట్ల పనులకు సీఎం యడియూరప్పే ఆదేశాలు జారీ చేశారని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అన్నీ తెలిసి కూడా ఈ విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని, ఇదే ఒరవడి కొనసాగితే ఓ మంత్రిగా క్యాబినెట్ లో తన స్థానం ఏమిటో అర్థం కావడంలేదని ఈశ్వరప్ప వాపోయారు.

మంత్రి లేఖతో యడియూరప్ప మంత్రివర్గంలో నెలకొన్న అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. ఈశ్వరప్ప, యడియూరప్ప ఒకే ప్రాంతానికి చెందివారు. శివమొగ్గ నుంచి వచ్చిన వీరు ఒకప్పుడు సన్నిహితులుగా మెలిగారు. అయితే, 2019లో కాంగ్రెస్, జనతాదళ్ సర్కారు కూలిపోయిన సమయంలో ప్రభుత్వం ఏర్పాటుకు  సహకరించిన కొందరికి యడియూరప్ప మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ఈశ్వరప్పతో ఆయన సంబంధాలు క్షీణించాయి.


More Telugu News