కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటించిన ఏపీ సర్కారు... మినిమమ్ చార్జీల ఎత్తివేత

  • గృహ వినియోగదారులకు ఊరట
  • ఇకపై కనీస చార్జీలు ఉండవు
  • కిలోవాట్ కు రూ.10 చెల్లిస్తే చాలన్న ప్రభుత్వం
  • యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గింపు
  • కులవృత్తుల వారికి కొనసాగనున్న ఉచిత విద్యుత్
ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త విద్యుత్ టారిఫ్ ను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. గృహ వినియోగదారులకు ఇకపై మినిమమ్ చార్జీలు ఉండవని, చార్జీల స్థానంలో కిలోవాట్ కు రూ.10 చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు.

కులవృత్తుల వారికి ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రజక సంఘం లాండ్రీలకు నెలకు 150 యూనిట్లు, బీపీఎల్ పరిధిలోని స్వర్ణకారులకు 100 యూనిట్లు, బీపీఎల్ లో ఉన్న ఎంబీసీ వర్గాలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు 150 యూనిట్లు, చేనేత కార్మికులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు వివరించారు. కులవృత్తుల వారికి అందించే ఉచిత విద్యుత్ కారణంగా ప్రభుత్వంపై రూ.1,657 కోట్ల భారం పడుతుందని తెలిపారు.  

ఇక, ఆక్వా రైతులకు ఒక యూనిట్ రూ.2.35కే రాయితీపై అందిస్తామని వెల్లడించారు. తాజా టారిఫ్ ప్రకారం సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గుతుందని వెల్లడించారు. అటు, రైతుల ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.7,297 కోట్లు భరించనుందని నాగార్జునరెడ్డి వివరించారు.


More Telugu News