పవన్ పాదయాత్ర కాకపోతే.. తలకిందుల యాత్ర చేసుకోవచ్చు: బొత్స

  • ఏప్రిల్ 3న తిరుపతిలో పాదయాత్ర చేయనున్న పవన్ కల్యాణ్
  • బీజేపీకి ప్రజామద్దతు లేనందువల్లే పవన్ పేరును వాడుకుంటోందన్న బొత్స
  • తిరుపతి ఎన్నికకు, పవన్ సీఎం అని చెప్పడానికి సంబంధం ఏమిటి?
తిరుపతి ఉపఎన్నిక బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3న ఆయన తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారు. అనంతరం శంకరంబాడి సర్కిల్ లో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ పాదయాత్ర కాకుంటే, తలకిందుల యాత్ర చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

పవన్ కాబోయే సీఎం అని చెప్పడానికి, తిరుపతి ఉపఎన్నికకు సంబంధం ఏమిటని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ బొత్స ప్రశ్నించారు. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో తిరుపతి సభలో మోదీ ఏం చెప్పారని... ఆ తర్వాత ఏం చేశారని ప్రశ్నించారు. అలాంటి బీజేపీ ఇప్పుడు సీఎం చేస్తాం, పీఎం చేస్తాం అంటే జనాలు నమ్మరని అన్నారు. బీజేపీకి  ప్రజామద్దతు లేనందువల్లే పవన్ పేరు చెప్పుకుంటోందని... టీడీపీలోని ఒక వర్గం కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.

మూడు రాజధానులను అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు యత్నిస్తున్నాయని బొత్స మండిపడ్డారు. కోర్టులో పిటిషన్లు కూడా వేశాయని... వాటిని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.


More Telugu News