వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన త్రిసభ్య కమిటీ

  • తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వ్యవసాయ చట్టాలు
  • రెండు నెలల పాటు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
  • సమస్య అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో కమిటీ
  • సీల్డ్ కవర్ లో నివేదిక అందించిన కమిటీ
  • 85 రైతు సంఘాలతో చర్చించినట్టు కమిటీ వెల్లడి
దేశంలో వ్యవసాయ చట్టాలపై నిరసనజ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబడుతుండగా, సవరణలు చేస్తామే తప్ప, తొలగించేది లేదని కేంద్ర స్పష్టం చేస్తోంది. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు వ్యవసాయ చట్టాలపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించగా, ఇప్పుడా కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

అభ్యంతరాలు ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాలపై తాము అధ్యయనం చేసిన అంశాలను ఓ సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించింది. ఈ నివేదిక రూపొందించే క్రమంలో తాము 85 రైతు సంఘాలను సంప్రదించామని, వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు తగిన పరిష్కారాలను రైతు సంఘాల నేతలతో చర్చించామని త్రిసభ్య కమిటీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

సుప్రీంకోర్టు జనవరి 12న కేంద్ర వ్యవసాయ చట్టాల అమలుపై రెండు నెలల స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ అందించిన నివేదికను పరిశీలించి ఈ కేసులో తన నిర్ణయాన్ని వెలువరించనుంది.


More Telugu News