అచ్చం మా స్కూల్లో విధించే శిక్షలాగే ఉందే!: ఆనంద్ మహీంద్రా

  • మహారాష్ట్రలో కరోనా విలయం
  • మాస్కులు లేనివారికి పోలీసు శిక్షలు
  • ముంబయి మెరైన్ డ్రైవ్ లో మాస్కు లేకుండా దొరికిన ప్రజలు
  • వారితో డక్ వాకింగ్ చేయించిన పోలీసులు
  • ఇక మాస్కు మర్చిపోనంటూ వ్యాఖ్యానించిన ఆనంద్
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించని వారితో గుంజీలు తీయించడం, కప్పగంతులు వేయించడం, డక్ వాకింగ్ వంటి శిక్షలు విధిస్తున్నారు.

ఇటీవల ముంబయి మెరైన్ డ్రైవ్ లో మాస్కులు లేని కొందరిని దొరకబుచ్చుకున్న పోలీసులు వారితో డక్ వాకింగ్ చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దానిపై స్పందించారు.

ఈ శిక్షలు చూస్తుంటే తాను చిన్నప్పుడు చదివిన గురుకుల పాఠశాలలో విధించే శిక్షల్లా ఉన్నాయని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చూసేవాళ్లకు నవ్వు తెప్పించినా, డక్ వాకింగ్ చేసేవాళ్ల బాధ అంతాఇంతా కాదని పేర్కొన్నారు. 'తాజాగా ముంబయి పోలీసులు విధించిన శిక్షను చూసిన తర్వాత ఇక మాస్కు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోను బాబూ' అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ముంబయి పోలీసుల వీడియోను తన ట్వీట్ లో పంచుకున్నారు.


More Telugu News