స్నేహితుడికి గిఫ్ట్ ఇవ్వాలనుకుని.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన యువతి!

  • హైదరాబాద్, హిమాయత్ నగర్ లో ఘటన
  • ఆన్ లైన్ లో లిక్కర్ కోసం వెతికితే మోసం
  • కేసును విచారిస్తున్న పోలీసులు
తన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఓ బ్రాండెడ్ మద్యం బాటిల్ ను బహుమతిగా పంపించి ఆశ్చర్య పరుద్దామని భావించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ. 2 లక్షలు సమర్పించుకుంది. హైదరాబాద్, హిమాయత్ నగర్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న యువతి, తన ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా లిక్కర్ బాటిల్ పంపాలని భావించి, గూగుల్ లో ఆన్ లైన్ ఆర్డర్ చేస్తే, డెలివరీ ఇచ్చేవారి కోసం వెతికింది.

ఈ క్రమంలో ఆమెకు ఓ నంబర్ కనిపించగా, ఫోన్ చేసింది. తాము కుల్ దీప్ వైన్స్ నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మింది. ఆర్డర్ చేస్తే, నగరంలో ఎక్కడికైనా మద్యం పంపుతామని చెప్పడంతో రూ. 10 వేలను గూగుల్ పే ద్వారా తొలుత చెల్లించింది. ఆపై తమకు డబ్బు జమ కాలేదని, ఓ క్యూఆర్ కోడ్ ను పంపుతామని దాన్ని స్కాన్ చేయాలని చెప్పగా, ఆమె ఆలాగే చేసింది.

ఆ వెంటనే యువతి ఖాతా నుంచి రూ. 30 వేలు డెబిట్ అయ్యాయి. ఆ వెంటనే కాల్ చేసిన సైబర్ కేటుగాడు, తమకు ఎక్కువగా డబ్బులు వచ్చాయని, బాటిల్ ఖరీదు మినహా మిగతా డబ్బులను తిరిగి మీ ఖాతాలోకే వేస్తామంటూ నమ్మబలికి, ఇంకో క్యూఆర్ కోడ్ ను పంపించాడు.

దాన్ని స్కాన్ చేసిన తరువాత, తప్పు జరిగిపోయిందంటూ మరో కోడ్ పంపించాడు. ఇలా దఫదఫాలుగా రూ. 1.20 లక్షలు కాజేశారు. చివరిగా ఓ రూ. 200 బాధితురాలి ఖాతాకు జమ చేస్తూ, క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ చెబితే మొత్తం డబ్బులు ఇస్తామనడంతో నమ్మిన ఆమె మొత్తం వివరాలు అందించింది.

ఆపై రూ. 70 వేలు ఆమె ఖాతా నుంచి మాయం కావడంతో, తాను మోసపోయానని భావించిన ఆమె, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా విచారణ ప్రారంభించారు.


More Telugu News