తెలంగాణలో మూడు రోజులపాటు వడగాలులు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న వాతావరణశాఖ

  • కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో గరిష్ఠంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత
  • హైదరాబాద్‌లో 40 డిగ్రీల నమోదు
  • ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ
తెలంగాణలో మూడు రోజులపాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారం రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో గరిష్ఠంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఉత్తర దిశ నుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News