'టిక్ టాక్'కు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన ఇండియా!

  • గత సంవత్సరం టిక్ టాక్ పై నిషేధం
  • హెచ్ఎస్బీసీ, సీటీ బ్యాంకుల్లోని ఖాతాల సీజ్
  • అధికారికంగా స్పందించని ఆర్థిక శాఖ
గత సంవత్సరం ఇండియా నిషేధాన్ని ఎదుర్కొన్న వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్ బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. బైట్ డ్యాన్స్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టిందన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

గత సంవత్సరం టిక్ టాక్ ను నిషేధించిన తరువాత జనవరిలో భారత ఉద్యోగుల్లో అత్యధికులను తొలగించింది. అయినా, ఇప్పటికీ దాదాపు 1,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారంతా విదేశీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

ఇండియా, చైనాల మధ్య సరిహద్దుల్లో విభేదాలు వచ్చి, చిన్న సైజ్ యుద్ధాలు జరిగిన వేళ, భారత్ కీలక నిర్ణయం తీసుకుంటూ చైనాకు చెందిన వందల యాప్ ల వాడకాన్ని ఇండియాలో నిషేధించిన సంగతి తెలిసిందే. బైట్ డ్యాన్స్ కు సిటీ బ్యాంకు, హెచ్ఎస్బీసీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు స్తంభింపజేస్తూ, నిర్ణయం తీసుకుంది.

ఇదే సమయంలో ఈ రెండు బ్యాంకుల నుంచి బైట్ డ్యాన్స్ భారత విభాగం ఏ విధమైన డబ్బులను డ్రా చేయకుండా చూడాలని కూడా ఆదేశించింది. మరే ఇతర బ్యాంకు ఖాతాలతో బైట్ డ్యాన్స్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కు లింక్ ఉన్నా ఆ ఖాతాల నుంచి డబ్బులు బట్వాడా కాకుండా చూడాలని పేర్కొంది. టిక్ టాక్ ఖాతాల నిలిపివేతపై అటు హెచ్ఎస్బీసీ బ్యాంకు, ఇటు సిటీ బ్యాంకులతో పాటు భారత ఆర్థిక శాఖ కూడా అధికారికంగా స్పందించలేదు.


More Telugu News