ఆసియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ... న్యూయార్క్ నడి వీధిలో వృద్ధురాలిపై దాడి

  • న్యూయార్క్‌లో ఏషియన్లపై పెరుగుతున్న దాడులు
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 33 కేసుల నమోదు
  • వృద్ధురాలి పొట్టలో పిడిగుద్దులు కురిపించిన నిందితుడు
ఆసియాపై ద్వేషం పెంచుకున్న ఓ దుండగుడు అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ఆసియా అమెరికన్ వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడు. 65 ఏళ్ల బాధిత వృద్ధురాలు సోమవారం మధ్యాహ్నం మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా వచ్చిన దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

తొలుత ఆమె ముఖంపై కొట్టిన నిందితుడు ఆ తర్వాత ఆమె పొట్టలో పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె కిందపడి బాధతో విలవిల్లాడింది. ఆమెపై దాడిచేస్తున్న సమయంలో నిందితుడు ఆసియా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.

వృద్ధురాలిపై నిందితుడు దాడిచేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు చోద్యం చూశారే తప్ప.. ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. గాయపడిన వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఆసియా ప్రజలను ద్వేషిస్తున్న ఘటనలకు సంబంధించి న్యూయార్క్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 33 కేసులు నమోదు కావడం గమనార్హం.


More Telugu News