ధన్యవాదాలు తెలుపుతూ మోదీకి  లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్

  • పాకిస్థాన్ డే సందర్భంగా ఇమ్రాన్ కు లేఖ రాసిన మోదీ
  • పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటామన్న ఇమ్రాన్
  • కశ్మీర్ వివాదానికి ముగింపు పలకాలని విన్నపం
పాకిస్థాన్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారత ప్రధాని మోదీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. పాకిస్థాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు పంపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని లేఖలో ఇమ్రాన్ పేర్కొన్నారు. తమ సార్వభౌమ రాజ్యానికి ముందుచూపుతో పునాదులు వేసిన తమ జాతిపితలను గుర్తు చేసుకుని, వారికి నివాళులు అర్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.

భారత్ సహా పొరుగు దేశాలన్నింటితో పాక్ ప్రజలు శాంతిని, పరస్పర సహకారాన్ని కోరుకుంటారని ఇమ్రాన్ తెలిపారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాలు, ముఖ్యంగా కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని చెప్పారు. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు. కరోనాపై భారత ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారని కొనియాడారు.


More Telugu News