విరాట్​–రోహిత్​ దోస్తానా.. దగ్గర చేసిన రవిశాస్త్రి!

  • ఇద్దరితోనూ పదే పదే చర్చలు
  • లోపాలు సరిదిద్దుకునేలా చేసిన కోచ్
  • సాయం చేసిన బయోబబుల్ నిబంధనలు
  • ఇంగ్లండ్ సిరీస్ లో కలిసిమెలిసి కనిపించిన కోహ్లీ–రోహిత్
‘‘రోహిత్–కోహ్లీ మధ్య దూరం పెరిగిందట.. ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదటగా.. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట’’ ఇదీ కొన్నాళ్ల క్రితం వరకు క్రికెట్ అభిమానుల నోటి నుంచి వినిపించిన గుసగుసలు. వాటికి తగ్గట్టే ఆస్ట్రేలియాతో సిరీస్ సహా అంతకుముందు పరిణామాలూ ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ ఇద్దరు డాషింగ్ బ్యాట్స్మెన్ ఒక్కటయ్యారట.

ఇంగ్లండ్ తో రెండ్రోజుల క్రితం ముగిసిన సిరీస్ లో ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం కనిపించింది. కలిసి నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలపై చర్చించడం వంటివి వెలుగు చూశాయి. ఓ మ్యాచ్ లో ఇద్దరూ ఓపెనింగ్ జోడీగా వచ్చి అదరగొట్టారు కూడా.

అంతేకాదు.. రెండు మూడు మ్యాచ్ లలో కోహ్లీ ఉండగానే రోహిత్ ఇన్ చార్జి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడమూ చూశాం. మరి, వారిద్దరి మధ్య వైరం పోయి.. మళ్లీ స్నేహం చిగురించడానికి కారణమేంటి? దాని వెనుక ఎవరున్నారు? అంటే.. వస్తున్న సమాధానం కఠినమైన క్వారంటైన్ నిబంధనలు, టీమిండియా కోచ్ రవి శాస్త్రి.

అవును, క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం వారిద్దరి మధ్య మళ్లీ స్నేహం పెరగడానికి, లోపాలను సరిచేసుకోవడానికి కారణం రవిశాస్త్రేనని తెలుస్తోంది. ఇంగ్లండ్ తో సిరీస్ సందర్భంగా రవిశాస్త్రి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి విభేదాలపై చర్చించారట. డ్రెస్సింగ్ రూంలో పదే పదే వారితో మాట్లాడి వారిలోని లోపాలను సరిదిద్దుకునేలా చేశారట. ఇద్దరూ మళ్లీ మునుపటిలా స్నేహితుల్లా కలిసి ఉండేలా చూశారట.

‘‘ఓ పెద్ద సిరీస్ గెలవడం కన్నా.. ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఇద్దరు మేటి ఆటగాళ్లు కలిసి పోవడం మంచి విషయం. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఇద్దరి మధ్యా అపోహలు తొలగిపోయాయి. మునుపటి కన్నా వారి బంధం బలపడింది. క్రికెట్, టీమ్, వారి వారి బాధ్యతలు, ఎదుర్కోబోయే సవాళ్లపై ఒకరికొకరు మంచి సహకారం అందించుకుంటున్నారు’’ అని టీమ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. టీమ్ కోసం పనిచేస్తేనే తమకు లాభం కలుగుతుందని ఇద్దరూ అర్థం చేసుకున్నారన్నారు. గత నాలుగు నెలల్లో టీమ్ కు ఇదే అతిపెద్ద లాభం అన్నారు.

బయటి వారి గుసగుసలతో పరిస్థితులు మరింత దిగజారాయన్నారు. అందరిలాగే విరాట్, రోహిత్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కానీ, వాటిని వివాదం చేసి కొందరు పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరి మధ్యా మంచి స్పష్టత ఉందన్నారు. అందుకు కఠినమైన క్వారంటైన్, బయో బబుల్ నిబంధనలు కారణమయ్యాయన్నారు.

బయోబబుల్ లో ఎక్కువగా గడపడం ద్వారా ఇద్దరి మధ్య దూరం చాలా వరకు తగ్గిందన్నారు. వారిద్దరి మధ్య బంధం మరింత బలపడేందుకు బయోబబుల్ నిబంధనలు తోడ్పడ్డాయన్నారు. దానికి తోడు రవిశాస్త్రి సహకారమూ కలిసివచ్చిందన్నారు. ఇప్పటికైనా వదంతులను కట్టిపెట్టాలన్నారు. ఇద్దరిలో ఎవరూ ఎవరికి తక్కువ కారని, ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే బయటివారికి అవకాశం ఇవ్వకుండా ఇద్దరే కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటే మంచిదని అన్నారు.


More Telugu News