మయన్మార్​ శరణార్థులపై ఆదేశాలను వెనక్కు తీసుకున్న మణిపూర్​

  • విమర్శలు రావడంతో నిర్ణయం
  • తప్పుగా అర్థం చేసుకున్నారన్న హోం శాఖ
  • మానవతా దృక్పథంతో సాయం చేస్తామని వెల్లడి
  • వైద్యం తప్ప తిండి, నీళ్లివ్వొద్దని ఇంతకుముందు ఆదేశం
మయన్మార్ శరణార్థులపై మణిపూర్ ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకుంది. వైద్యసాయం తప్ప.. తిండి, నీళ్లు, ఆశ్రయం ఇవ్వొద్దంటూ ప్రజలకు రాష్ట్ర సర్కారు సూచించిన సంగతి తెలిసిందే.

మయన్మార్ లో సైనిక పాలన నడుస్తుండడం.. ప్రజలు దానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తుండడంతో.. వారిని సైనికులు పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఒక్కరోజే వంద మందినిపైగా సైన్యం పొట్టనపెట్టుకుంది. సొంత ప్రజలపైనే బాంబులు వేసింది.

ఈ నేపథ్యంలోనే మయన్మార్ ను వదిలి ప్రజలు భారత్ ను శరణు కోరుతున్నారు. శరణార్థులుగా వస్తున్నారు. దీంతో వారికెవరూ సాయం చేయొద్దంటూ మార్చి 26న మణిపూర్ కఠిన ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈరోజులోగా చెప్పాలంటూ అధికారులను రాష్ట్ర హోం శాఖ ఆదేశించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగడంతో హోం శాఖ వెనక్కు తగ్గింది.

ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంటూ.. అధికారులకు లేఖ రాసింది. ‘‘లేఖలో ఉన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఆ పొరపాటును సరిదిద్దేందుకు ప్రభుత్వ ఆదేశాల లేఖను వెనక్కు తీసుకుంటున్నాం’’ అని పేర్కొంటూ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి హెచ్. జ్ఞాన ప్రకాష్ తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని, గాయపడిన మయన్మార్ శరణార్థులను ఇంఫాల్ కు తీసుకొచ్చి చికిత్స చేయిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి సాయం చేస్తుందన్నారు.


More Telugu News