రూ.2000, రూ.500, రూ.200.. చెత్త ఎత్తే కొద్దీ నోట్ల కట్టలు!

  • ఏపీలోని తాడేపల్లిలో ఘటన
  • 30 కట్టలను చూసి పంచాయతీ కార్మికుల షాక్
  • గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారం
  • ‘చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ముద్రను చూసి నవ్వులు
పొద్దున్నే రోడ్లపై పడిన చెత్తను ఊడ్చేందుకు తాడేపల్లిలో పంచాయతీ కార్మికులు డ్యూటీ ఎక్కారు. ఉండవల్లి సెంటర్ లోని ఎస్బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు.. వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. కానీ, కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఆ ‘పిల్లల నోట్ల’ కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.


More Telugu News