1945 తరువాత ఢిల్లీలో మార్చి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు!

  • 1945 మార్చి 31న 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత
  • ఆపై నిన్న 40.1 డిగ్రీలకు వేడిమి
  • వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ
దేశ రాజధాని న్యూఢిల్లీలో మార్చి నెల ఉష్ణోగ్రతల పరంగా చూస్తే... 1945, మార్చి 31 తరువాత అత్యధిక ఎండవేడిమి నమోదైంది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ను దాటింది. హోలీ రోజున గరిష్ఠ ఉష్ణోగ్రత 76 సంవత్సరాల రికార్డులను గుర్తు చేసిందని అధికారులు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో 1945లో 40.5 డిగ్రీలకు ఎండ వేడిమి చేరుకుందని గుర్తు చేసిన ఐఎండీ రీజనల్ ఫోర్ కాస్టింగ్ సెంటర్ హెడ్ కుల్ దీప్ శ్రీవాత్సవ, సఫ్దర్ జంగ్ లేబొరేటరీలో ఈ వేడిమి నమోదైందని అన్నారు.

సోమవారం నాడు గాలి చాలా తక్కువగా వీచిందని, ఆకాశం నిర్మలంగా ఉండటంతో సూర్యుడి ప్రతాపం నేరుగా ప్రజలపై పడిందని ఆయన అన్నారు. కాగా, ఢిల్లీలో 1973, మార్చి 29న అత్యధికంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇప్పుడు అంతకు మించిన వేడిమి నమోదైంది. ఇదే సమయంలో నిన్న కనీస ఉష్ణోగ్రత 20.6 డిగ్రీలకు చేరిందని, సాధారణంతో పోలిస్తే ఇది మూడు డిగ్రీలు అధికమని కుల్ దీప్ వెల్లడించారు.


More Telugu News