భారత్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న మూడో కరోనా టీకా!

  • రష్యాలో రూపొందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌
  • భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌
  • భారత‌ ఔషధ నియంత్రణ సంస్థ వద్ద ఉన్న ఫలితాలు
  • రష్యాలో నిర్వహించిన ట్రయల్స్‌లో 91.6 శాతం సమర్థత
కరోనా నివారణకు రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌లో త్వరలోనే అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏపీఐ, సర్వీసెస్‌ సీఈఓ దీపక్‌ సప్రా తెలిపారు. మరికొన్ని వారాల్లో భారత్‌లో వినియోగానికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో ఈ టీకాను సరఫరా చేసేందుకు ‘రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌‌ ఫండ్ ‌(ఆర్‌డీఐఎఫ్‌)’తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. వాటి మధ్యంతర ఫలితాల్ని భారత ఔషధ నియంత్రణ సంస్థకు అందజేశారు.

వీటి సమీక్ష పూర్తయితే.. అనుమతులు వచ్చేస్తాయని దీపక్‌ తెలిపారు. స్పుత్నిక్‌-వి రెండు డోసుల టీకా అని దీపక్‌ వెల్లడించారు. తొలి డోసు ఇచ్చిన తర్వాత 21వ రోజు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 28 నుంచి 42 రోజుల మధ్య కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని వివరించారు. భారత్‌, రష్యా, యూఏఈ సహా మరికొన్ని దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. 91.6 శాతం సామర్థ్యం కనబరిచినట్లు వెల్లడించారు. ఈ ఫలితాలు ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌లోనూ ప్రచురితమైనట్లు తెలిపారు.


More Telugu News