ఎట్టకేలకు ప్రయాణం ప్రారంభించిన సూయజ్ కాలువలోని ‘ఎవర్‌ గివెన్‌’ నౌక

  • దాదాపు వారం రోజుల సమస్యకు పరిష్కారం
  • ఫలించిన టగ్‌ బోట్లు, డ్రెడ్జర్ల ఆపరేషన్‌
  • గ్రేట్‌ ఫిట్టర్‌ సరస్సు వైపు నౌక మళ్లింపు
  • గత మంగళవారం ఇసుకలో కూరుకుపోయిన నౌక
ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన భారీ సరకు రవాణా నౌక సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. 10 టగ్‌ బోట్లు, డ్రెడ్జర్ల ద్వారా చేసిన ఆపరేషన్‌ ఫలించింది. ప్రస్తుతం నౌక కాలువలో ప్రయాణాన్ని ప్రారంభించినట్లు కెనాల్‌ సర్వీస్‌ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం నౌకను గ్రేట్‌ ఫిట్టర్‌ సరస్సు వైపు తీసుకెళుతున్నట్లు తెలిపారు. నౌకలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయేమో అక్కడ పరిశీలిస్తామన్నారు.  

గత మంగళవారం భారీ అలల ధాటికి కుదుపునకు గురైన ఈ భారీ నౌక సూయజ్ కాలువలో ఇసుకలో కూరుకుపోయింది. ఇందులో 20 వేలకు పైగా కంటైనర్లు ఉన్నాయి. సూయజ్  కాలువ ఆసియా, ఐరోపా మధ్య ఉన్న అతిపెద్ద జలమార్గం కాగా.. ప్రపంచ వాణిజ్యంలో 10 శాతం ఈ కాలువ ద్వారానే జరుగుతోంది. దీంతో అప్పటి నుంచి రోజుకు 900 బిలియన్‌ డాలర్ల విలువైన సరకు రవాణా నిలిచిపోయింది. ఈ మార్గంలో వెళ్లే ముడిచమురు సహా ఇతర సరుకులతో కూడిన వందలాది నౌకలు ఇప్పటి వరకు అక్కడే బారులు తీరాయి. ప్రస్తుతం ఎవర్‌ గివెన్ కదలడంతో నిలిచిపోయిన నౌకలన్నీ ప్రయాణం ప్రారంభించనున్నాయి.


More Telugu News