పవన్ కల్యాణ్ 100 శాతం సీఎం అభ్యర్థి: జనసేన స్పష్టీకరణ

  • పవన్ కల్యాణ్ సీఎం అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యలు
  • సోము వ్యాఖ్యలను ఉటంకిస్తూ నాదెండ్ల మనోహర్ ప్రకటన
  • పవన్ వంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరం అని ఉద్ఘాటన
  • కార్యకర్తలు ఇంటింటికీ తిరగాలని దిశానిర్దేశం
ఏపీలో బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని సోము వీర్రాజు అనడంతో చర్చ మొదలైంది.

సోము వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ 100 శాతం సీఎం అభ్యర్థి అని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జాతీయ పార్టీ బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని, నిజాయతీగా ప్రజల కోసం పనిచేసే పవన్ కల్యాణ్ వంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం అని అన్నారు.

పవన్ సీఎం అవ్వాలంటే కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులతో సరిపెట్టుకుంటే కుదరదని, అందరూ బయటికి వచ్చి ఇంటింటికీ తిరిగి జనసేనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని, బీజేపీతో ఎందుకు కలిసి పనిచేస్తున్నామో వివరించాలని దిశానిర్దేశం చేశారు. 10 మంది జనసైనికులు 1000 మందితో సమానం అని శ్రేణుల్లో ఉత్సాహం నూరిపోసే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ బెదిరింపులను సైతం ఖాతరు చేయకుండా పార్టీ వీరమహిళలు ఎదురొడ్డి నిలిచారని కితాబునిచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు విసుగెత్తి పోతున్నారని నాదెండ్ల వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా బలిజ సోదరులు అధైర్యపడవద్దని సూచించారు. బలిజ సోదరుల్లో ధైర్యం నింపుదాం అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. "మీలో ధైర్యం నింపే నాయకుడు పవన్ కల్యాణ్ మీకు అండగా ఉంటారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా స్పందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే పవన్ స్వయంగా వచ్చి సమస్యను ఎదుర్కొంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర సర్కారు అమలు చేయకపోవడం వల్ల యువత ఎంతో నష్టపోతోంది" అని వివరించారు.

ఇక తిరుపతి పార్లమెంటు స్థానంలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కోసం వచ్చే వారం పవన్ రోడ్ షో నిర్వహించనున్నారని నాదెండ్ల వెల్లడించారు. ఈ రోడ్ షో అనంతరం బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.


More Telugu News