మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: బొత్స స్పష్టీకరణ

  • పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తాం
  • అభివృద్ధి అవకాశాలను చంద్రబాబు నాశనం చేశారు
  • అమరావతిని ఓ వర్గానికి రాజధానిగా మార్చారు
రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు.

పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఉన్న అవకాశాలను చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాశనం చేశారని విమర్శించారు. అమరావతిని ఓ వర్గానికి చెందిన రాజధానిగా మార్చి అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అడ్డంకులు తొలగిపోగానే విలీన గ్రామాలతో కలిపి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వివరించారు.


More Telugu News