హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం రసాభాస.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న అర్షద్ అయూబ్, అజారుద్దీన్

  • వివాదాల చుట్టూ హెచ్‌సీఏ
  • శ్రుతిమించి ఆరోపణలు చేసుకున్న అజర్, అర్షద్
  • అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్‌వర్మను ప్రతిపాదించడంతో గొడవ మొదలు
  • తీవ్రంగా వ్యతిరేకించిన అర్షద్ వర్గం
  • చివరకు రాజీ.. ఏప్రిల్ 11కు ఏజీఎం వాయిదా
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) గతంలో ఎన్నడూ లేనంతగా వార్తల్లోకి ఎక్కుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగితేలుతోంది. ముఖ్యంగా హెచ్‌సీఏ చీఫ్‌గా మహ్మద్ అజారుద్దీన్ ఎన్నికైన తర్వాతి నుంచి దాని చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. తాజాగా, నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) రాసాభాసగా మారింది. అజారుద్దీన్, అర్షద్ అయూబ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ శ్రుతిమించి మరీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అజారుద్దీన్ నేతృత్వంలో నిన్న సర్వసభ్య వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జస్టిస్ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమించడంపై మొదలైన చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. దీపక్‌వర్మను ఎలా నియమిస్తారంటూ అర్షద్ అయూబ్ వర్గం నినాదాలు చేసింది. జస్టిస్ నిసార్ అహ్మద్ కుక్రూను ఆ స్థానంలో నియమించాలని అర్షద్ డిమాండ్ చేశాడు.

అర్షద్ ప్రతిపాదనకు శివలాల్ యాదవ్ కూడా మద్దతు ప్రకటించినట్టు హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ చెప్పగా అజర్ వారించాడు. అందరి మద్దతు దీపక్‌వర్మకే ఉందని చెప్పాడు.  అదే సమయంలో జస్టిస్ మీనాకుమారి పేరు కూడా తెరపైకి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో అజర్, అర్షద్ మధ్య చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ‘‘దేశాన్ని అమ్మేసిన ఫిక్సర్‌వు నువ్వు’’ అని అజర్‌ను అర్షద్ దూషించాడు. దీనికి అజర్ కూడా అంతే స్థాయిలో బదులిచ్చాడు. ‘‘హెచ్‌సీఏను దోచుకున్న దొంగవు నువ్వు. నీ మోసాలు నాకు తెలియనివా. నీపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. నీ సంగతి తేలుస్తా’’ అని అజర్ హెచ్చరించాడు.

బీసీసీఐలో హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించేది తానేనని, నీ ప్రవర్తనపై బీసీసీఐకి, హైకోర్టుకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. హెచ్‌సీఏకు పరిపాలకులను నియమించమని కోరుతానని చెప్పడంతో అందరూ వెనక్కి తగ్గారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామంటూ రాజీకొచ్చారు.

అంబుడ్స్‌మన్ ఎథిక్స్‌లో రెండు పదవులకు గాను జస్టిస్ దీపక్‌వర్మ, జస్టిస్ నిసార్ అహ్మద్ కుక్రూ, జస్టిస్ మీనాకుమారి పేర్లను ప్రతిపాదించారు. దీంతో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, కాబట్టి వచ్చే నెల 11కు ఏజీఎంను వాయిదా వేసినట్టు విజయానంద్ తెలిపాడు. ఆ రోజు అవసరమైతే రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నికుంటామని చెప్పారు. మరోవైపు, క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి సుదీప్ త్యాగి, స్రవంతి నాయుడు, డయానా డేవిడ్‌లను ఎంపిక చేసినట్టు చెప్పారు.


More Telugu News