ఉత్కంఠపోరులో భారత్ విజయం... వన్డే సిరీస్ కైవసం

  • 330 పరుగుల లక్ష్యఛేదనలో హడలెత్తించిన ఇంగ్లండ్
  • తుదకంటా పోరాడిన శామ్ కరన్
  • ఆఖరి ఓవర్లో అద్భుతంగా బంతులేసిన నటరాజన్
  • 7 పరుగుల తేడాతో భారత్ విజయం
  • 2-1 తేడాతో వన్డే సిరీస్ భారత్ వశం
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన చివరి వన్డేలో భారత్ విజయం సాధించింది. పుణే వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో నెగ్గి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. 330 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ చివరి వరకు భారత్ ను హడలెత్తించాడు. ఇన్నింగ్స్ 50వ ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓటమిపాలైంది. వీరోచితంగా పోరాడిన శామ్ కరన్ 95 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. అంతకుముందు డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (35), లివింగ్ స్టన్ (36), మొయిన్ అలీ (29) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, భువనేశ్వర్ కుమార్ 3, నటరాజన్ ఓ వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. నాలుగు క్యాచ్ లు వదిలేసి మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. కాగా, ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్ లు భారత్ వశం కాగా, ఇంగ్లండ్ ఉత్త చేతులతో స్వదేశానికి పయనమవుతోంది.


More Telugu News