ప్రజలు చెబితే వినట్లేదు.. లాక్‌డౌన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి: అధికారుల్ని ఆదేశించిన ఉద్ధవ్‌ థాకరే

  • మహారాష్ట్రలో కరోనా విజృంభణ
  • ప్రజలు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారన్న సీఎం
  • కేసులు ఇలాగే పెరిగితే ఆరోగ్య సంక్షోభం తప్పదని వెల్లడి
  • నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న రాత్రిపూట కర్ఫ్యూ
మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఏమాత్రం నియంత్రణలోకి రావడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత చెప్పినా ప్రజలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని.. లాక్‌డౌన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా విజృంభణ, తాజా పరిస్థితులపై ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేశ్ తోపే, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం కుంటే, కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్ వైద్యులు, ఇత‌ర అధికారుల‌తో ఆదివారం స‌మీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ఉద్ధ‌వ్.. క‌రోనా కేసులు ఇలాగే పెరిగితే రాష్ట్రం మౌలిక వ‌స‌తుల కొరతతో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కునే దుస్థితి తలెత్తుతుందన్నారు.

మరోవైపు ఆ రాష్ట్ర స‌చివాల‌యంతో పాటు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను సంద‌ర్శించే సాధార‌ణ ప్ర‌జ‌లపై అధికారులు ఆంక్ష‌లు విధించారు. ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేష్ తోపీ మాట్లాడుతూ ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా ఉండ‌టం వ‌ల్లే రాష్ట్రంలో ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు.

ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ప్ర‌దీప్ వ్యాస్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం 3.75 ల‌క్ష‌ల ఐసోలేష‌న్ పడకలు, 1.07 ల‌క్ష‌ల సాధారణ పడకలు నిండిపోయాయని తెలిపారు. 60,349 ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా పడకలు ఉన్నాయ‌ని, వాటిలో 12,701 బెడ్ల‌పై ఇప్పటికే రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కొరత ఏర్పడుతుందని తెలిపారు.

ముందుగా ప్రకటించినట్లుగా ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లులోకి రానుంది. దీని ప్ర‌కారం షాపింగ్ మాల్స్ రాత్రి ఎనిమిది గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు మూసి ఉంచుతారు.


More Telugu News