శ్రీరామన‌వ‌మికి కల్యాణాన్ని చూడ‌డానికి భద్రాద్రికి రావద్దు.. డ‌బ్బులు వాప‌స్ ఇస్తాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  • క‌రోనా విజృంభ‌ణ‌ నేప‌థ్యంలో నిర్ణ‌యం
  • కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శ్రీరామ‌న‌వ‌మి
  • భక్తుల రాకపై ఆంక్షలు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాల‌యాల్లో కొవిడ్ నిబంధ‌నలు
దేశంలో మ‌రోసారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఈసారి కూడా భద్రాద్రిలో శ్రీరామ‌ న‌వ‌మి వేడుక‌లను నిరాడంబ‌రంగా నిర్వహించాల‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ‌ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ‌త ఏడాది నిర్వహించిన‌ట్లుగానే కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ను జ‌రుపుతామని తెలిపారు.

భక్తులెవరూ సీతారామ కల్యాణాన్ని చూడ‌డానికి భద్రాద్రికి రావద్దని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూడాల‌ని తెలిపారు. ఆన్‌లైన్లో ఇప్ప‌టికే క‌ల్యాణ‌ టిక్కెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులకు ఆ డ‌బ్బులను తిరిగి చెల్లిస్తామ‌ని వివ‌రించారు. అంతేగాక‌, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాల‌యాల్లో కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే భ‌క్తుల‌కు ద‌ర్శనాలు క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.




More Telugu News