రూ.100 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి భారత్ బయోటెక్ లేఖ!

  • కరోనా టీకా ఉత్పత్తి పెంపుపై విజ్ఞప్తి
  • అదే బాటలో సీరమ్ ఇనిస్టిట్యూట్
  • టెక్నాలజీని బదలాయించాలన్న మహారాష్ట్ర
  • ముంబైలో కొవ్యాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తామని వెల్లడి
కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ మొదలైపోయిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. అదే టైంలో కరోనా టీకా కార్యక్రమం నిదానంగా నడుస్తోంది. అంతేకాదు, మనకన్నా ఎక్కువ డోసులను విదేశాలకు పంపిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే టీకా డోసుల ఉత్పత్తిని పెంచాలని సంస్థలకు సూచనలూ వెళ్లాయి. అయితే, ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలంటే నిధులూ కావాల్సిందేనని సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి భారత్ బయోటెక్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా రూ.100 కోట్ల నిధులు ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం. కొవిడ్ సురక్షా స్కీమ్ కింద నిధులను అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు 40 లక్షల కొవ్యాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి 10 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయాలని సీరమ్ లక్ష్యంగా పెట్టుకుంది. టీకా ఉత్పత్తిపై నియమించిన మంత్రివర్గ కమిటీ.. ఆ రెండు సంస్థల్లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి తీరును ఇటీవలే సమీక్షించింది. రెండు సంస్థల విజ్ఞప్తులకు అనుగుణంగా కొవిడ్ సురక్ష పథకం కింద సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్ చెప్పారు.

కాగా, వ్యాక్సిన్ టెక్నాలజీ బదలాయింపునకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర కోరింది. ముంబైలోని హాఫ్కిన్ బయో ఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ లో టీకాలను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) టెక్నాలజీని బదలాయిస్తే.. హాఫ్కిన్ లో కొవ్యాగ్జిన్ ఉత్పత్తిని మొదలుపెడతామని చెప్పింది.


More Telugu News