ఈ వేసవిలో హైదరాబాద్ వాసులకు మామిడి దూరమే!

ఈ వేసవిలో హైదరాబాద్ వాసులకు మామిడి దూరమే!
  • వాస్తవానికి ఇప్పటికే ప్రారంభం కావాల్సిన సరఫరా
  • శీతాకాలంలో సరిగ్గా పడని మామిడి పూత
  • అసాధారణ వాతావరణ పరిస్థితులే కారణం
  • కిలోకు రూ. 200 వరకూ పలుకుతున్న ధర
శివరాత్రి వెళ్లిపోయింది. వేసవి వచ్చేసింది. అయినా ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇంకా మామిడి పంట రాలేదు. సాధారణ స్థాయితో పోలిస్తే, చాలా తక్కువ దిగుబడి మాత్రమే మార్కెట్ కు వస్తోంది. దాదాపు 50 శాతం మేరకు దిగుబడి పడిపోయిందని, ఈ సీజన్ మొత్తం ఇదే పరిస్థితి కనిపించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో మామిడి ధరలు సాధారణ ప్రజలకు అందనంత ఎత్తునకు చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. ఈ వేసవిలో మామిడి దిగుబడి తక్కువగానే ఉంటుందని అంటున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ లలో ఒకటైన కొత్తపేట మార్కెట్ కు గత కొన్ని రోజులుగా మామిడి పండ్లు వస్తున్నాయి. గడ్డి అన్నారం మార్కెట్ కు 3 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఇది నగర డిమాండ్ కు ఏ మాత్రం సరిపోదు. ఇదే విషయాన్ని వెల్లడించిన కొత్తపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రతినిధులు, ఈ సమయంలో మార్కెట్ కు దాదాపు 5 వేల క్వింటాల పంట రావాల్సి వస్తుంటుందని, కానీ, ఇప్పుడది సగానికి తగ్గిందని అన్నారు. గత శీతాకాల సీజన్ లో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడిన కారణంగా మామిడి పూత సరిగ్గా ఏర్పడలేదని, దాని ప్రభావమే ఇప్పుడు మార్కెట్ పై పడిందని విశ్లేషించారు.

ఇదే సమయంలో ఏప్రిల్ తరువాత పరిస్థితులు మారి మరింత దిగుబడి మార్కెట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కృష్ణా, ఖమ్మం, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఇప్పుడు స్వల్ప మొత్తం మామిడి వస్తోందని, నూజివీడు, మైలవరం నుంచి ఇంకా మార్కెట్ కు పంట రావడం లేదని అన్నారు. బేనీషా, తోతాపురి, హిమాయత్, దషేరీ వెరైటీలు ఇప్పటికే రావాల్సి వున్నా రాలేదని వెల్లడించారు.

ఇక పంట తక్కువగా ఉండటంతో ధర అధికంగా పలుకుతోంది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో గ్రేడ్-1 మామిడికి క్వింటాలుకు రూ. 6 వేల ధర పలుకుతోంది. అంటే కిలోకు రూ.60 అన్నట్టు. ఇది వినియోగదారుడికి చేరేవరకు రూ. 200 దాటుతోంది. మామిడి సరఫరా తక్కువగా ఉన్నా, ద్రాక్ష, పుచ్చకాయలు, నారింజ, అరటి, యాపిల్ పంట దిగుబడి మాత్రం అధికంగానే ఉండటంతో, ఈ ఫలాలు డిమాండ్ ను తీరుస్తున్నాయి.



More Telugu News