భారత్‌లో అందుబాటులోకి రానున్న మరో టీకా

  • క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన సీరం
  • కోవావాక్స్‌ పేరిట సెప్టెంబరులో వచ్చే అవకాశం
  • యూకే ట్రయల్స్‌లో 89 శాతం సమర్థత
  • పేద, మధ్యాదాయ దేశాలకు సరఫరాయే లక్ష్యం
భారత్‌లో మరికొన్ని నెలల్లో మరో టీకా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఔషధ తయారీ సంస్థ నోవావాక్స్‌ రూపొందించిన కొవావాక్స్ టీకా క్లినికల్‌  ట్రయల్స్‌ను భారత్‌లో తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు  సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అమెరికా ఫార్మా సంస్థ నొవావాక్స్‌తో ఎస్ఐఐ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేస్తోందని పూనావాలా తెలిపారు. భారత్ సహా పేద, మధ్యాదాయ దేశాల్లో సరఫరా చేయడానికి నొవావాక్స్‌తో సీరం ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కొత్త రకాలైన ఆఫ్రికా, యూకే వేరియంట్లపైనా ఈ టీకాను పరీక్షించారని తెలిపారు. మొత్తంగా 89 శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు తేలిందని వివరించారు. ఈ టీకాపై యూకేలో ట్రయల్స్ జరిగాయన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సీరం ఇప్పటికే కొవిషీల్డ్ టీకాను భారత్‌లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలకూ  ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌లను ఎగుమతి చేస్తోంది.


More Telugu News