ఓటీటీ ప్లాట్ ఫామ్ స్వేచ్ఛను లాగేసుకోవడం సరికాదు: రాధికా ఆప్టే

  • ఓటీటీ కంటెంట్ పై నిబంధనలు విధించిన కేంద్రం
  • భావ ప్రకటన స్వేచ్ఛ అవసరమన్న రాధికా ఆప్టే
  • ఓటీటీ వల్ల కొత్త ఆలోచనలు ప్రజలకు చేరుతున్నాయని వ్యాఖ్య
ఓటీటీ ప్లాట్ ఫామ్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే సినీ పరిశ్రమపై సెన్సార్ ఉన్నట్టు ఈ ప్లాట్ ఫామ్ పై నియంత్రణ లేదు. దీంతో వీటిలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ లు మితిమీరిన శృంగారం, అసభ్యతతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ విషయంపై కేంద్రం ఇటీవలే కొన్ని నియమనిబంధనలను రూపొందించింది. అయితే కేంద్ర ప్రభుత్వ నియంత్రణపై సినీ నటి రాధికా ఆప్టే అభ్యంతరం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా అవసరమని... ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి దాన్ని లాగేసుకోవాలనుకోవడం సరికాదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓటీటీ కారణంగా ఎన్నో కొత్త ఆలోచనలు ప్రజలకు చేరుతున్నాయని... వీటి వల్ల ఎందరికో ఉపాధి లభిస్తోందని రాధికా ఆప్టే వ్యాఖ్యానించింది. రాబోయే ఐదారేళ్లలో మరెన్ని మార్పులు వస్తాయో చూడాలని చెప్పింది. మరోవైపు ఆమె నటించిన కొన్ని వెబ్ సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాయి. వీటిలో ఆమె నటించిన కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉండటంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందాల ఆరబోతకు వెనుకాడని రాధికా ఆప్టేలాంటి వాళ్లు ఇలాగే మాట్లాడతారని మండిపడుతున్నారు.


More Telugu News