ఈ శతాబ్దం చివరినాటికి ఏడాదిలో సగభాగం వేసవి కాలమే!

ఈ శతాబ్దం చివరినాటికి ఏడాదిలో సగభాగం వేసవి కాలమే!
  • గ్లోబల్ వార్మింగ్ ప్రభావం
  • క్రమేణా పెరుగుతున్న భూమి ఉష్ణోగ్రతలు
  • మరో 60 ఏళ్లలో 17 రోజుల మేర పెరగనున్న వేసవి
  • శీతాకాలం, వర్షాకాలం నిడివి తగ్గుతోందని ఆందోళన
రానున్న దశాబ్దాల్లో భూతాపం మరింత పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎంతగా అంటే... ఈ శతాబ్దం చివరి నాటికి ఏడాదిలో ఆర్నెల్ల పాటు వేసవి కాలమే ఉంటుందట. గ్రీన్ హౌస్ ఉద్గారాల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే జరిగేది ఇదేనని ఓ అధ్యయనం చెబుతోంది. మరో 60 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వేసవికాలం సగటున మరో 17 రోజులు పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న యుపింగ్ గ్వాన్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా శీతాకాలాల నిడివి కుచించుకుపోతోందని, తద్వారా వేసవి దినాల సంఖ్య హెచ్చుతోందని వివరించారు. ఈ పరిణామం మానవుల ఆరోగ్యంపైనే కాకుండా, ప్రపంచ వ్యవసాయ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల కారణంగా కలిగే వ్యాధులు మరింత ప్రబలుతాయని, పుప్పొడి కారణంగా తలెత్తే అలర్జీ సమస్యలు అధికం అవుతాయని, పంటల కాలావధి కూడా మరింత హెచ్చుతుందని పేర్కొన్నారు.

వేసవి కాలం నిడివి పెరగడం వల్ల ఇతర రుతువుల ప్రారంభం కూడా ప్రభావితమవుతుందని, వర్షాకాలం, శీతాకాలం మరింత ఆలస్యం అవుతాయని వివరించారు. 1952 నుంచి 2011 మధ్యన వేసవి కాలం 78 నుంచి 95 రోజులకు పెరిగిందని... అదే సమయంలో వసంత రుతువు 124 నుంచి 115 రోజులకు, శరద్ రుతువు 87 నుంచి 82 రోజులకు, శీతాకాలం 76 నుంచి 73 రోజులకు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.

ఉత్తరార్ధ గోళంలో ఇప్పటికే సుదీర్ఘ వేసవి కాలాలు సంభవిస్తున్నాయని, అయితే మధ్యధరా ప్రాంతంలో 1950 నుంచి ప్రతి పదేళ్లకు 8 రోజుల చొప్పున వేసవి నిడివి పెరుగుతూ వస్తోందని వివరించారు. ప్రస్తుతానికి ఇది సాధారణంగానే ధ్వనించవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.


More Telugu News