రండి.. సదస్సులో పాల్గొనండి: ప్రధాని మోదీకి బైడెన్​ ఆహ్వానం

  • పర్యావరణ సదస్సుకు 40 దేశాల నేతలు
  • ఏప్రిల్ 22, 23వ తేదీల్లో వర్చువల్ గా కార్యక్రమం
  • పర్యావరణ మార్పులపై సదస్సులో చర్చ
ఏప్రిల్ 22, 23వ తేదీల్లో నిర్వహించే పర్యావరణ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం పంపారు. ఆయనతో పాటు 40 దేశాల నేతలను ఆహ్వానించారు. దీనిపై శనివారం శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల పాటు జరిగే సదస్సును వర్చువల్ గా నిర్వహించనున్నట్టు తెలిపింది. ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు చెప్పింది.

పర్యావరణ మార్పులపై గ్లాస్గో వేదికగా ఈ ఏడాది నవంబర్ లో ఐక్యరాజ్యసమితి నిర్వహించతలపెట్టిన ‘కాప్ 26’ సదస్సుకు ఇది రీహార్సల్ గా ఉంటుందని, ముఖ్యమైన విషయాలపై చర్చించవచ్చని తెలిపింది. మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, సౌదీ రాజు సల్మాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లను ఆహ్వానించారు. దక్షిణాసియా నుంచి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ లనూ సదస్సుకు పిలిచారు.

సదస్సులో భాగంగా ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఐక్యరాజ్యసమితి విధించిన సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడంపై చర్చించనున్నారు. మెరుగైన పర్యావరణం ఉంటే మంచి వేతనాలతో ఉద్యోగాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను సృష్టించుకోవచ్చని, వాటి ద్వారా ప్రభావిత దేశాలకు సాయం చేయొచ్చని వైట్ హౌస్ పేర్కొంది. కాప్ 26 సదస్సు నాటికి అమెరికా 2030 ఉద్గారాల లక్ష్యాన్ని ప్రకటిస్తుందని చెప్పింది.


More Telugu News