సరిహద్దుల్లో ఇప్పటికీ క్రియాశీలకంగానే చైనా స్థావరాలు... ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి

  • ఇటీవల ఎల్ఏసీ నుంచి వెనుదిరుగుతున్నట్టు చైనా వెల్లడి
  • కానీ 'నాకు లా' వద్ద తిష్టవేసినట్టు ఆధారాలు
  • శాటిలైట్ ఫొటోల్లో కొత్త నిర్మాణాలు వెల్లడి
  • స్పష్టంగా కనిపిస్తున్న చైనా ఆర్మీ కదలికలు
చైనా ఎంతటి జిత్తులమారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎగదోస్తుంటుంది. అయితే ఇటీవల లడఖ్ వద్ద ఎల్ఏసీ పొడవునా వివాదాస్పద ప్రాంతాల నుంచి తన బలగాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. చైనా నిర్ణయంతో సంతృప్తి చెందిన భారత సైన్యం కూడా తన స్థావరాలకు మరలింది. అయితే తాజాగా వెల్లడైన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో సిక్కింకు సమీపంలో వివాదాస్పద ప్రాంతాల్లోని చైనా స్థావరాలు ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాయని గుర్తించారు.

'నాకు లా' సరిహద్దుకు సమీపంలో చైనా స్థావరాల్లో కదలికలు బహిర్గతం అయ్యాయి. రహదారులు, కొత్త స్థావరాలను నిర్మిస్తూ చైనా తన కార్యకలాపాలను ముమ్మరం చేసిందని ఆ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. డోక్లాం, నాకు లా ప్రాంతాలను ఫ్లాష్ పాయింట్స్ గా పిలుస్తారు. ఇటీవల భారత్, చైనా బలగాలు పరస్పరం ఎదురై ఘర్షణ పడింది ఇక్కడే.

అయితే, కాపెల్లా స్పేస్ కంపెనీకి చెందిన శాటిలైట్లు అత్యాధునిక సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) పరిజ్ఞానంతో తీసిన ఫొటోలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబరులో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలతో వాటిని పోల్చి చూస్తే చైనా కుటిలనీతి బట్టబయలైంది. వాటిలో చైనా మిలిటరీ ట్రక్కులు, కొత్త నిర్మాణాలు ప్రస్ఫుటంగా దర్శనమిచ్చాయి. సరిహద్దుకు ఈ ప్రాంతం కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీనిపై భారత వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News