వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా.. ఆస్పత్రిలో అగ్నిప్రమాదంపై ఉద్ధవ్ థాకరే

  • ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య
  • శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉద్ధవ్‌
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం
మహారాష్ట్రలో కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన‌ అగ్నిప్రమాదంలో మరణించిన రోగుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముంబయి బండప్‌ ప్రాంతంలోని ఒక మాల్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్న చోట శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది రోగులు చనిపోయారు.

సీఎం ఉద్ధవ్‌ థాకరే అగ్ని ప్రమాదం జరిగిన మాల్‌ను శుక్రవారం సందర్శించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో చాలా మంది వెంటిలేటర్‌పై ఉన్న రోగులని తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని, వారి నుంచి క్షమాపణలు కూడా కోరుతున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు మాల్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్న సన్‌షైన్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నాగ్రేల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, షాపింగ్‌ మాల్‌లో ఆసుపత్రిని నిర్వహించడాన్ని ముంబయి మేయర్ తీవ్రంగా‌ తప్పుపట్టారు. అందులోని 70 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.


More Telugu News