చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీఐడీ ముందుకెళ్లడానికి అభ్యంతరం ఏంటి?: సజ్జల

  • తాడేపల్లిలో సజ్జల ప్రెస్ మీట్
  • చంద్రబాబు సీఐడీ ముందుకు రావాలని సవాల్
  • స్టేతో తప్పించుకున్నా విచారణకు రాక తప్పదని స్పష్టీకరణ
  • ఇదసలు కేసే కాదంటున్నారని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజాయతీ ఉంటే సీఐడీ అధికారుల ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని అన్నారు. ఇప్పటికి స్టేతో తప్పించుకున్నా, భవిష్యత్తులో విచారణకు రాక తప్పదని స్పష్టం చేశారు.

రాజధాని పేరుతో లక్ష కోట్లు దోపిడీకి ప్రణాళికలు రచించారని, వాస్తవానికి పేదలకు సహాయం చేయాల్సింది పోయి వారిని భయపెట్టి భూములు తీసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు అసలు ఇది కేసే కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరైతే ఫిర్యాదు చేశారో వారితోనే తాము అలా చేయలేదని చెప్పిస్తున్నారని సజ్జల ఆరోపించారు. స్కాం జరిగిందనడానికి ఫిర్యాదుదారుడే వచ్చి చెప్పాల్సిన అవసరంలేదని, మరి కోర్టుల్లో ప్రజాప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎలా దాఖలవుతున్నాయని ప్రశ్నించారు.

2015లో రాజధాని ప్రస్తావన తెచ్చారని, ప్రకటనకు ముందే సైలెంట్ గా భూములు సేకరించారని ఆరోపించారు. పేదల నుంచి అసైన్డ్ భూములు రాయించుకుని, వారికి అన్యాయం చేశారని, జీఓ నెం.41 ద్వారా పెద్దలకు మాత్రమే ప్రయోజనం కల్పించారని వివరించారు. ఈ భూముల సేకరణ రెవెన్యూ అధికారుల ద్వారా జరిగింది కాదని సజ్జల వెల్లడించారు. చంద్రబాబు నాడు సీఆర్డీయే చైర్మన్ గా ఉన్నారని, ఇంతపెద్ద కుంభకోణం కళ్ల ముందు కనిపిస్తున్నా సమర్థించుకుంటున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News