ఉత్తరాదిన ఉద్ధృతంగా భారత్ బంద్... నిలిచిన పాలు, కూరగాయల సరఫరా!

  • న్యూఢిల్లీకి దారితీసే రహదారుల దిగ్బంధం
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా నేడు తలపెట్టిన భారత్ బంద్, ఉత్తరాది రాష్ట్రాల్లో సంపూర్ణంగా జరుగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీకి దారితీసే అన్ని రహదారులనూ రైతులు దిగ్బంధించగా, ప్రజలకు నిత్యావసరాలైన పాలు, కూరగాయలు సరఫరా చేసే వాహనాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే నాలుగు రైళ్లు పూర్తిగా రద్దు కాగా, 30కి పైగా రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఢిల్లీ, చండీగఢ్, ఫిరోజ్ పూర్, అమృతసర్ తదితర స్టేషన్లలో నిలిపివేశారు. దేశ రాజధాని చుట్టు పక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ బంద్ తీవ్రత అధికంగా ఉంది.

జాతీయ రహదారి - 9పై రైతులు బైఠాయించడంతో ఘజియాపూర్ నుంచి ఢిల్లీకి రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసినా, రైతు నిరసనలు మాత్రం ఆగలేదు. ఇదే సమయంలో సింఘూ సరిహద్దుతో పాటు తిక్రి సరిహద్దుల్లో సైతం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమ మనసులోని మాటను ప్రభుత్వానికి చేరవేసేందుకు పాలు, నిత్యావసరాల వాహనాలను కూడా అడ్డుకుంటున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు.

వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఈ ఉదయం 5 గంటలకు మొదలైన నిరసనలు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగిస్తామని మరో రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

బంద్ ప్రభావంతో ఢిల్లీలోని దాదాపు అన్ని మార్కెట్లూ మూతపడ్డాయి. ఇదేసమయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ మాత్రం తాము బంద్ లో పాల్గొనడం లేదని, షాపులు తెరిచే వున్నాయని ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న వ్యాపారులు, ఇటువంటి బంద్ లతో మరింతగా నష్టపోతారన్న ఉద్దేశంతోనే బంద్ కు మద్దతు ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు.


More Telugu News