నాలుగు దేశాల‌ క్వాడ్ కూట‌మిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం: చైనా

  • లేని స‌మ‌స్య‌లను సృష్టించకూడదు
  • శాంతి, సుస్థిర‌త‌కు స‌హ‌క‌రించాలి
  • అమెరికాది కోల్డ్ వార్ ధోర‌ణి అన్న చైనా 
ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భార‌త్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు క్వాడ్ కూట‌మిని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కూట‌మి చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతోంది. దీనిపై చైనా స్పందిస్తూ..  తాము క్వాడ్ కూట‌మిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపింది. లేని స‌మ‌స్య‌లను సృష్టించకూడ‌ద‌ని హిత‌వు ప‌లికింది.

శాంతి, సుస్థిర‌త‌కు స‌హ‌క‌రించాలంటూ  చైనా ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి క‌ల్న‌ల్ రెన్ గువోకియాంగ్ అన్నారు.  అమెరికా కోల్డ్ వార్ ధోర‌ణికి ఈ క్వాడ్ కూట‌మి  అద్దం ప‌డుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఒక జ‌ట్టుగా ఏర్పడి ఘ‌ర్ష‌ణ‌కు దిగే చ‌ర్య‌గా ఈ కూట‌మి తీరు ఉంద‌ని చెప్పారు. ఈ కూట‌మి ద్వారా అమెరికా భౌగోళిక ‌రాజకీయ ఆట‌ల‌కు తెర‌లేపిందంటూ వ్యాఖ్య‌లు చేశారు.  

శాంతి, అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని, కానీ, అలా కాకుండా  స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం సరికాద‌ని హిత‌వు ప‌లికారు. ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డానికే అమెరికా ఇటువంటి ధోర‌ణుల‌ను అవ‌లంబిస్తోంద‌ని చెప్పారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన క్వాడ్ స‌మావేశాల్లో నాలుగు దేశాల ప్ర‌తినిధులు.. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లతో పాటు చైనాకు సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు.


More Telugu News