ఆర్టీసీ బస్సులో 14.8 కిలోల బంగారం తరలింపు..  సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసుల సీజ్

  • పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు
  • రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ ఉద్యోగి నుంచి స్వాధీనం
  • బంగారాన్ని సీజ్ చేసి కర్నూలు పోలీసులకు అప్పగింత
ఆర్టీసీ బస్సులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వారి కథనం ప్రకారం.. తెలంగాణ‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో రాజు అనే ప్రయాణికుడి వద్ద ఉన్న సంచిలో 14.8 కేజీల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ అనే నగల దుకాణంలో తాను గుమాస్తాగా పనిచేస్తున్నట్టు రాజు తెలిపాడు. యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణం నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఆ బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కర్నూలు అర్బన్ పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News