యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు.. హన్మకొండలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఘనకార్యం

  • వైద్యుడి అవతారమెత్తిన మెడికల్ రిప్రజెంటేటివ్
  • హన్మకొండలో ఆసుపత్రి పెట్టి మరీ అబార్షన్లు
  • పోలీసుల అదుపులో నిందితుడు
యూట్యూబ్‌లో చూసి అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఓ మెడికల్ రిప్రజెంటేటివ్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి (38) బీఎస్సీ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు ఏకంగా వైద్యుడి అవతారం ఎత్తాడు.

నెల రోజుల క్రితం హన్మకొండ ఏకశిల పార్క్ ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరిట ఓ ఆసుపత్రి ప్రారంభించాడు. రెండోసారి ఆడపిల్ల పుట్టే అవకాశం ఉన్న మహిళలను గుర్తించి అబార్షన్ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చే పనిని ఆర్ఎంపీలు, పీఎంపీలకు అప్పగించాడు. అలా వచ్చిన మహిళలకు నర్సింగులో శిక్షణ పొందినవారితో యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేయిస్తున్నాడు.

సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొన్న అర్ధరాత్రి ఆసుపత్రిపై దాడిచేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళకు చికిత్స చేస్తున్న సిబ్బంది అధికారులను చూసి గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూములో దాచిపెట్టారు.

 పోలీసులు ఆమెను గుర్తించి బయటకు తీసుకొచ్చారు. రక్తస్రావం అవుతుండడంతో వెంటనే ఆమెను హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం నర్సంపేటలోనూ ఇలానే ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా, పోలీసులు సీజ్ చేశారు.


More Telugu News