మమతా బెనర్జీ డెంగీ, మలేరియాతో స్నేహం చేస్తున్నారు... అమిత్‌ షా ఎద్దేవా

  • వ్యాధుల నిర్మూలన జరగాలంటే బీజేపీకి ఓటేయాలని పిలుపు
  • ప్రజలకు దీదీ ఫ్లోరైడ్‌ నీళ్లు సరఫరా చేస్తున్నారని ఆరోపణ
  • పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.18వేలు అందిస్తామని హామీ
  • మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో రవాణా ఉచితం
పశ్చిమ బెంగాల్‌లో డెంగీ, మలేరియా వ్యాధులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్నేహం చేస్తున్నారని, అందుకే అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యాధులు పూర్తిగా అంతరించాలంటే బీజేపీకి ఓటేయాలని ఓటర్లను కోరారు. గురువారం బాఘ్‌ముండి ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దీదీపై తీవ్రమైన విమర్శలు చేశారు.  

రాష్ట్ర ప్రజలకు దీదీ ఫ్లోరైడ్‌ నీటిని సరఫరా చేస్తున్నారని షా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.10వేల కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. గతంలో తృణమూల్‌, లెఫ్ట్‌ ప్రభుత్వాలు రాష్ట్రానికి పరిశ్రమల్ని రాకుండా చేశాయని ఆరోపించారు. అందుకే ఉపాధి అవకాశాలు రాలేదన్నారు. ఉద్యోగాలు కావాలంటే బీజేపీని గెలిపించి తీరాలన్నారు. దీదీ తన మేనల్లుడిని సీఎం చేయడం కోసం ఎన్నికలు కావాలనుకుంటున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం 115 స్కీంలు ప్రవేశపెట్టారని అమిత్‌ షా తెలిపారు. కానీ బెంగాల్‌లో దీదీ 115 స్కాంలు చేశారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.18వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో రవాణా ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పశ్చిమబెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29వతేదీ వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.


More Telugu News