తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ!

  • ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక
  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, వైసీపీ
  • ఉత్కంఠకు తెరదించిన బీజేపీ
  • రత్నప్రభ అభ్యర్థిత్వం ఖరారు
  • అధికారిక ప్రకటనే తరువాయి
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే బీజేపీ మాత్రం తమ అభ్యర్థి ఎంపిక కోసం భారీగా కసరత్తులు చేసింది. చివరికి మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును ఖరారు చేశారు. దీనిపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్ పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కాగా, ఈ స్థానం కోసం మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్టు తెలిసింది. అయితే రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్... దాసరి శ్రీనివాసులుకు ప్రచార కమిటీలో స్థానం కల్పించింది.

రత్నప్రభకు ఫైర్ బ్రాండ్ అధికారిణి అని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని గుర్తింపు ఉంది. వైసీపీ, టీడీపీలకు దీటుగా ఉండాలంటే రత్నప్రభ వంటి వ్యక్తి సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.


More Telugu News