కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు... సీఎం జగన్ ప్రకటనతో హృదయం ఉప్పొంగిందన్న చిరంజీవి

  • కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించిన సీఎం
  • ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం
  • హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి
  • సీఎం జగన్ నిర్ణయం అత్యంత సముచితంగా ఉందని వెల్లడి
ఏపీ సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట నామకరణం చేశారు.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి వెల్లడించారు.

ఉయ్యాలవాడ అత్యంత గొప్ప దేశభక్తుడని, అయితే చరిత్రలో మరుగునపడిపోయాడని వివరించారు. అలాంటి వీరుడి పేరు ఎయిర్ పోర్టుకు పెట్టడం అత్యంత సముచిత నిర్ణయమని కొనియాడారు. కాగా, అంతటి యోధుడి పాత్రను తెరపై తాను పోషించడం తనకు దక్కిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఉయ్యాలవాడ జీవితకథతో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.


More Telugu News