బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు

  • ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్న శక్తికాంత దాస్
  • నిరర్థక ఆస్తుల ప్రమాదంతోనే ప్రక్షాళన అని కామెంట్
  • వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా తగ్గదని వెల్లడి
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తమ విధానాల్లో ఆరోగ్యవంతమైన బలమైన మూలపెట్టుబడులతో కూడిన బ్యాంకింగ్ రంగం, నైతిక విలువలతో కూడిన పాలనకే ప్రాధాన్యమన్నారు. గురువారం ఆయన బ్యాంకుల స్థితిగతులపై మాట్లాడారు.

బ్యాంకులపై నిరర్థక ఆస్తుల భారం పెరిగిందని, కరోనా మహమ్మారి నేపథ్యంలో అవి మరింత పెరిగే ప్రమాదముందని అన్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని చెప్పారు. 2022 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్బీఐ అంచనా వేసిన 10.5 శాతం వృద్ధి రేటులో ఎలాంటి తగ్గుదల ఉండబోదన్నారు.

ఆర్థిక, ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగించేవేనని, అయితే, ప్రస్తుతం దానితో పోరాడేందుకు అన్ని విధాలుగా కేంద్రం సమాయత్తమైందన్నారు.


More Telugu News