త్వరలోనే 50 వేల పోస్టులకు నోటిఫికేషన్​: మంత్రి హరీశ్​ రావు

  • ఉద్యోగులకు ప్రమోషన్లూ ఇస్తామని హామీ
  • ఉద్యోగుల వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపుకూ ఓకే
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వయోపరిమితి పెంపు బిల్లును సభ నేడు ఆమోదించింది.

అలాగే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకూ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం వీరికి కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకూ సభ ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుతో కొత్త ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నష్టం లేదన్నారు. 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఆరోగ్య ప్రమాణాలు మెరుగయ్యాయని, చాలా రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉందని హరీశ్ చెప్పారు. పీఆర్సీ నివేదికతో పాటు ఆయా విషయాలనూ దృష్టిలో ఉంచుకునే ఉద్యోగుల వయోపరిమితిని పెంచామని స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లూ ఇస్తామన్నారు.


More Telugu News