మహిళల ఆకారంపై డీఎంకే అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్!

  • కోయంబత్తూరు ర్యాలీలో దిండిగల్ లియోనీ వ్యాఖ్యలు
  • గతంలో మహిళల ఆకారం 8 అంకెలా ఉండేదని వ్యాఖ్య
  • విదేశీ ఆవుల పాలు తాగి షేపు కోల్పోతున్నారన్న అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరపున బరిలోకి దిగిన దిండిగల్ ఐ లియోనీ మహిళల శరీర ఆకృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మహిళలు తమ శరీర ఆకృతిని కోల్పోతున్నారని, విదేశీ ఆవుల పాలు తాగడం వల్ల బరువు పెరిగిపోతున్నారని అన్నారు.  ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ర్యాలీకి హాజరైన వారు కరతాళ ధ్వనులు చేయడం విశేషం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ ప్రకారం.. ‘‘మీకు తెలుసు చాలా రకాల అవులున్నాయి. ఫామ్స్‌లలో విదేశీ ఆవులు కూడా ఉన్నాయి. వాటి నుంచి పాలు పిండేందుకు మెషీన్లను ఉపయోగిస్తున్నారు. మెషీన్లను ఉపయోగించి ఓ వ్యక్తి గంటలో 40 లీటర్ల పాలు పితకవచ్చు. ఈ పాలు తాగడం వల్ల మన మహిళలు విపరీతంగా బరువు పెరుగుతున్నారు. బెలూన్‌లా తయారవుతున్నారు. గతంలో మహిళల ఫిగర్ 8 అంకెలా ఉండేది. వారు తమ హిప్స్‌ (తుంటిపై)పై  మోయగలిగేవారు. కానీ ఇప్పుడు అలా చేస్తే పిల్లలు కిందపడిపోతున్నారు. ఎందుకంటే వారిప్పుడు పీపాల్లా తయారయ్యారు. మన పిల్లలు కూడా లావైపోతున్నారు’’ అని అన్నారు.

లియోనీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. లియోనీపై చర్యలు తీసుకోవాలని పార్టీ మహిళా నేత, ఎంపీ కనిమొళిని డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News