జగన్ కు చుక్కెదురు.. జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

  • జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ
  • ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపామన్న సుప్రీంకోర్టు
  • అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత జగన్ ఫిర్యాదును తోసిపుచ్చినట్టు వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆయన చేసిన ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏపీలోని న్యాయ వ్యవస్థను ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

2020 అక్టోబర్ 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపిందని... అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత జగన్ ఫిర్యాదును తోసిపుచ్చడం జరిగిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్ సైటులో ఈరోజు సమాచారాన్ని ఉంచారు. అయితే ఇన్ హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనదని, దీనికి సంబంధించిన విషయాలు బయటకు వెల్లడించతగినవి కాదని ఆ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు చీఫ్ జస్టిస్ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా ఎన్వీ రమణను నియమించాలని కేంద్రానికి ఆయన ఈరోజు సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేస్తారు.


More Telugu News