సైన్యానికి 1300 వాహనాలను అందించనున్న మహీంద్రా

  • తేలికపాటి సాయుధ వాహనాల కొనుగోలుకు ఒప్పందం
  • నాలుగేళ్లలో 1300 వాహనాలు అందించేందుకు అంగీకారం
  • రక్షణరంగంలో ఆత్మనిర్భర్‌కు బాటలు
  • అన్ని రకాల పరిస్థితుల్లో వాహనాన్ని పరీక్షించిన సైన్యం
దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ భారత సైనిక దళాలకు వాహనాలను సరఫరా చేయనుంది. మొత్తం 1300 తేలికపాటి సాయుధ వాహనాలను దళాలకు అందించనుంది. ఈ వాహనాలను బలగాలు, ఆయుధాలను తరలించడానికి ఉపయోగించనున్నారు. ఈ ఒప్పంద విలువ రూ.1,056 కోట్లు. వచ్చే నాలుగేళ్లలో మహీంద్రా ఈ వాహనాలను సైన్యానికి అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలను మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌) ఛైర్మన్‌ ఎస్‌.పి శుక్లా మంగళవారం వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఈ ఒప్పందంతో బాటలు పడనున్నాయని శుక్లా అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో రూపొందించి తయారు చేసిన ఓ వాహనానికి దక్కిన అతిపెద్ద సైనిక కాంట్రాక్టని ఆయన తెలిపారు. దీంతో భారత్‌లో తయారైన సైనిక పరికరాల వినియోగానికి బాటలు పడనున్నాయన్నారు.

మరోవైపు భారత సైనికదళాల ప్రమాణాలకు అనుగుణంగా ఎండీఎస్‌ సంస్థ ఈ వాహనాలను అభివృద్ధి చేయనుంది. ఈ వాహనాలకు జీవితకాలం సంస్థ నుంచే సర్వీస్‌ అందనుంది. ఈ కొనుగోలు ఒప్పందానికి ముందు సైన్యం  వాహనంపై అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. వివిధ రకాల భౌగోళిక పరిస్థితుల్లో వాహన సామర్థ్యాన్ని పరీక్షించింది. పేలుళ్లకు తట్టుకొనే శక్తిని నిర్ధారించింది. ఈ తరహా వాహనాల్లో ఓ వేరియంట్‌ను సైన్యం ఇప్పటికే వినియోగిస్తుండడం గమనార్హం.


More Telugu News