6.3 జీబీ డేటా ఉంది.. ఢిల్లీకి వెళ్లి బండారం బయటపెడతా: ఫడ్నవిస్

  • ప్రకంపనలు పుట్టిస్తున్న హోంమంత్రి అనిల్ పై ఆరోపణలు
  • అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న ఫడ్నవిస్
  • సీఎంకు తెలిసినా చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని వ్యాఖ్య
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై వస్తున్న ఆరోపణలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. పార్లమెంటును సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఇదే సమయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరో బాంబు పేల్చారు. అనిల్ ను కాపాడుకునే క్రమంలో రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుందని ఆయన అన్నారు.

త్వరలోనే ఢిల్లీకి వెళ్లి సంకీర్ణ ప్రభుత్వం బండారాన్ని బయటపెడతానని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన అన్నారు. ఐపీఎస్, నాన్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ రాకెట్ కు సంబంధించిన కీలక పత్రాలు, కాల్ రికార్డింగులు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ రాకెట్ కు సంబంధించి తన వద్ద 6.3 జీబీ డేటా ఉందని... దీన్ని ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ సెక్రటరీకి అందజేస్తానని తెలిపారు.

బదిలీ రాకెట్ కు సంబంధించిన అనుమానితుల కాల్ రికార్డింగులను ఆగస్ట్ 20న మహారాష్ట్ర డీజీపీకి ఇంటెలిజెన్స్ కమిషనర్ పంపించారని.. ఆ తర్వాత వాటిని సీఎం థాకరేకు పంపించారని ఫడ్నవిస్ చెప్పారు. అయితే, థాకరే ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ... ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని తెలిపారు.

ఫిబ్రవరి ద్వితీయార్థంలో కరోనా వల్ల హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని అనిల్ చెపుతున్న మాటల్లో నిజం లేదని ఫడ్నవిస్ అన్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం ఫిబ్రవరి 17న సహ్యాద్రి గెస్ట్ హౌస్కు , ఫిబ్రవరి 24న మంత్రాలయ (సచివాలయం)కు వెళ్లారని చెప్పారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో కూడా ఆయన అధికారులను కలుస్తూనే ఉన్నారని అన్నారు.


More Telugu News