వైష్ణోదేవి ఆలయానికి 20 ఏళ్లలో 1,800 కేజీల బంగారం, రూ. 2 వేల కోట్ల నగదు విరాళం!

  • 20 ఏళ్లలో 4,700 కేజీల వెండి విరాళం
  • సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్న హేమంత్
  • 2020లో కరోనా వల్ల భారీగా తగ్గిన భక్తులు
జమ్ములోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి భక్తుల నుంచి పెద్ద సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. గత 20 ఏళ్లలో ఏకంగా 1,800 కేజీల బంగారం, 4,700 కేజీల వెండితో పాటు రూ. 2 వేల కోట్ల నగదు విరాళం రూపంలో అందింది. 2000 నుంచి 2020 మధ్య కాలంలో ఈ విరాళాలు వచ్చాయి. హేమంత్ గౌనియా అనే ఆర్టీఐ యాక్టివిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి తాను అర్జీ పెట్టుకున్నానని... ఆ తర్వాత తన అర్జీ వైష్ణోదేవి ఆలయం సీఈవో వద్దకు వెళ్లిందని హేమంత్ చెప్పారు.

గత కొన్నేళ్లుగా ఆలయానికి విరాళాల రూపంలో ఏం వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నానని హేమంత్ తెలిపారు. ప్రతి ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని... అయినప్పటికీ విరాళాలు ఇంత ఎక్కువగా వచ్చాయనే విషయాన్ని తాను ఊహించలేకపోయానని చెప్పారు.

2000లో ఈ దేవాలయాన్ని 50 లక్షల మంది భక్తులు సందర్శించారు. 2018-19లలో ఈ సంఖ్య 80 లక్షలకు చేరుకుంది. అయితే కరోనా వల్ల 2020లో ఈ సంఖ్య 17 లక్షలకు పడిపోయింది.


More Telugu News