కేంద్రం ఇచ్చిన రూ.10 వేల కోట్ల ‘ఎంఫాన్​’ నిధులను ‘మేనల్లుడు’ మెక్కాడు: అమిత్​ షా ఆరోపణ

  • సిట్ దర్యాప్తుతో తిన్నదంతా కక్కిస్తాం
  • బెంగాల్ లో కేంద్ర హోం మంత్రి ప్రచారం
  • మమత బెనర్జీ మేనల్లుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు
  • ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరిక
'ఎంఫాన్' తుపాను పరిహారం కింద పశ్చిమ బెంగాల్ కు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఇచ్చిందని, కానీ, అది జనమెవరూ చూడలేదని, ఎవరికీ అందలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆ మొత్తాన్ని ‘మేనల్లుడు’, ఆయన అనుచరులే పంచుకుతిన్నారని సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేడు ఆయన బెంగాల్ లోని 24 పరగణ జిల్లా గొసాబాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో  పాల్గొన్నారు.

తాము అధికారంలోకి రాగానే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసి వారు తిన్నదంతా కక్కిస్తామని అన్నారు. నిధులను కాజేసిన వారిపై దర్యాప్తు చేయిస్తామని, ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. 9 దీవుల సమూహమైన గొసాబాకు ఇప్పటికీ తాగు నీరు దిక్కులేదని అన్నారు. అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల కోట్లతో సుందర్ బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామన్నారు. సుందర్ బన్ కోసం ఓ ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుస్తామని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. సుందర్ బన్ లో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులను చేపడతామన్నారు.


More Telugu News